తెలంగాణ అమరవీరులకు జోహార్లు: జై తెలంగాణ

News pulse, Politics | admin | September 16, 2010 at 2:45 pm



ధర్మం కొరకు, కోటిన్నర తెలంగాణ ప్రజల న్యాయమైన హక్కుల కొరకు, దురహంకార పూరిత, స్వార్థ శక్తులకు వ్యతిరేకంగా 1969లో సాగిన చరిత్రాత్మక మహోద్యమంలో అసువులు బాసిన తెలంగాణ అమరవీరులకు జోహార్లు..

ఒక సైనికుడి వీరమరణం.. వెయ్యి మంది సైనికులకు ప్రేరణనిస్తుంది. ఒక ఉద్యమకారుడి త్యాగం అతని సహచరులకు ఉత్ప్రేరకం అవుతుంది. ఓ అమరవీరుల స్మృతి చిహ్నం జాతికి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమానికి నాలుగు దశాబ్దాల నాడు నాలుగు వందల మంది చేసిన త్యాగం స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇన్నేళ్ల తరువాత కూడా ఈ స్థూపం ఇంత చైతన్యశీలిగా ఎలా ఉంది? దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి?

హైదరాబాద్‌ నడిబొడ్డులో ఉన్న అపురూపమైన నిర్మాణం ఇది.. ఈ స్థూపం వందలాది అమరుల త్యాగనిరతికి, తుపాకి గుళ్లకు గురై తూట్లు పడ్డ తెలంగాణకు నిలువెత్తు నిదర్శనం. ఇవాళ తెలంగాణాలో జరుగుతున్న ఉద్యమానికి పునాది ఈ స్తూపంలోనే ఉంది. సరిగ్గా నాలుగు దశాబ్దాల క్రితం ఖమ్మం జిల్లాలో ఓ విద్యార్థి ప్రారంభించిన నిరాహార దీక్ష రాష్ట్రాన్ని పునాదుల్లో కదిలించింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం అప్పుడున్న తొమ్మిది జిల్లాల్లో మంటలు రేపింది. విద్యార్థులు ఒక విద్యాసంవత్సరాన్ని కోల్పోవలసిన పరిస్థితి వచ్చింది. ఆందోళనలను సర్కారు కఠినంగా అణచివేసిన పర్యవసానం అక్షరాలా 360 మంది బలిదానం..

తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణకోసం పెద్ద మనుషుల ఒప్పందంలో ఇచ్చిన హామీల అమలు కోసం సాగిన ఉద్యమం అది… 1956లో ఆంధ్ర ప్రాంతంతో విలీనమై సరిగ్గా 13 సంవత్సరాలైనా కాకుండానే ప్రత్యేక వాదం బయలుదేరింది. అసంతృప్తి రేగింది. దాదాపు పదకొండు మాసాల పాటు ఉద్యమం నిరాటంకంగా కొనసాగింది. చివరకు రాజకీయ కూటనీతికి విద్యార్థులు అలసిపోయారు.. ఉద్యమం చల్లారింది. నేతలూ చల్లగా జారుకున్నారు.. ఉద్యమం జాడలే లేకుండా పోయాయి. తెలంగాణ ప్రజానీకానికి తమ వీరపుత్రులకు నిర్మించుకున్న ఈ ఒక్క అమర స్తూపమే స్మృతిగా మిగిలింది. ఆ స్మృతే ఇవాళ్టికీ విద్యార్థులను నీడలా వెంటాడుతోంది. వాళ్లలో ఉద్యమస్ఫూర్తిని రగిలిస్తోంది… మరోసారి ప్రత్యేక తెలంగాణకు నినదించాల్సిన అవసరాన్ని గుర్తుకు తెచ్చింది…

Related posts:

  1. Will Coastal Andhra and Rayalseema be together?
  2. Hyderabad is part of Telangana – GK Pillai
  3. ఇంకెక్కడి సమైక్యత!
  4. Nagam says he will support Jagan if…
  5. Emirates T Cultural Association santhapa sabha
  6. T supporters pull mike from Revanth Reddy
  7. SI exams issue again
  8. Jupally starts his Telangana yatra
  9. Pocharam Srinivas joins TRS – in vdo
  10. తెలంగాణ యుద్ధ నీతి!

Leave a Reply

Spam protection by WP Captcha-Free