New style of canvassing, do not talk

News pulse, Politics | admin | April 27, 2011 at 4:00 am

ఎన్నికలలో పోటీచేసే అభ్యర్ధులు ఉపన్యాసాలతో హోరెత్తించడం చూస్తాం.కాని. పులివెందుల నియోజకవర్గంలో అందుకు భిన్నమైన వాతావరణం కనిపించడం విశేషం. ముఖ్యంగా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీచేస్తున్న వై.ఎస్.విజయమ్మ ఇంతవరకు ఒక్క ప్రసంగం చేయడం లేదు.

ఆమె విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ ఎక్కడా తాను ఏమి చేసేది, ఏమి చేయాలనుకునేది? పులివెందుల సమస్యలు ఏమిటి? మొదలైన విషయాలను ఎక్కడా ప్రస్తావించకుండా గ్రామాలలో ఆమె పర్యటిస్తున్నారు. మన రాష్ట్ర రాజకీయాలలో ఇదొక కొత్త అనుభవమే.ఇంతవరకు ఆమె మైకు పుచ్చుకున్నట్లు కనిపించలేదు. ఆయా గ్రామాలలో జనం దగ్గరకు వెళ్లడం, వారికి నమస్కరించడం,వారి నుంచి అభివందనలు అందుకోవడ, మహిళలతో కరచాలనం చేయడం, వారితో ఒకటి రెండు మాటలు మాట్లాడడం, తనకు ఓటు వేయమని మర్యాద కోసం అడగడడం , అక్కడి నుంచి కదలివెళ్లిపోవడం ఇది ఆమె వరస.

రాష్ట్ర రాజకీయాలలో తనదైన శైలిలో ప్రభావితం చేసి ఐదున్నర ఏళ్లపాటు రాష్ట్రాన్ని పరిపాలించిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి భార్యగా ఆమె జీవితంలో ఎన్నడూ ఊహించి ఉండదు. తాను ఇలా ప్రచారానికి తిరగవలసి వస్తుందని,కాని అనూహ్యంగా భర్త హెలికాఫ్టర్ ప్రమాదంలో మరణించడంతో పులివెందుల నుంచి అన్ని పార్టీల సహకారంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆమె శాసనసభకు వెళ్లింది కూడా తక్కువే.మాట్లాడింది అసలే లేదు. కాని చకచకా జరిగిపోయిన రాజకీయ పరిణామాలలో తన కుమారుడు జగన్ తో కలిసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

తిరిగి సొంత పార్టీ తరపున ఆమె ఎన్నికల బరిలో దిగారు. కిందటిసారి ఏకగ్రీవం అయితే,ఈసారి స్వయంగా తన మరిది నుంచే పోటీని ఎదుర్కోవలసి రావడం రాజకీయ వైచిత్రగా చెప్పుకోవచ్చు. దాంతో తనకోసం కాకపోయినా, తన కుమారుడి కోసం అయినా ఆమె ఎన్నికల బరిని సీరియస్ గా తీసుకుని ఆమె ప్రచార పర్వంలో విస్తృతంగా పాల్గొంటున్నారు.

ఆమె తన సమీప బంధువులు, పార్టీ లో ముఖ్యులు , సన్నిహితులతో కలిసి జనంలో కలవిడిగా తిరగడం ప్రజలను ఆకట్టుకుంటున్నది.అయితే వై.ఎస్.జీవించి ఉన్న రోజులలో ఎక్కువ సమయం బైబిల్ చదువుకుంటూ గడిపే ఆమె ఇప్పుడు వేడి,వేడి,వాడి,వాడి రాజకీయాలను చదువుతున్నారు.తన కుమార్తె షర్మిలా, కోడలు భారతిలు కూడా ఈ ప్రచారంలో విశేషంగా పాల్గొంటుండడంతో మొత్తం కుటుంబం అంతా దీనిని ఒక సవాలుగా తీసుకున్నట్లయింది.అయితే గతంలో రాజశేఖరరెడ్డి తరపున ఆమె ప్రచారంలో పాల్గొన్నా అది పెద్దగా గుర్తింపులోకి రాలేదు. పైగా ఇటీవలి సంవత్సరాలలో అసలు వై.ఎస్.రాజశేఖరరెడ్డే పులివెందులలో తిరగవలసిన అవసరం లేకుండా పోయింది.

అంతగా అక్కడ పట్టు పెరగడం ఒక కారణం అయితే,తమ్ముడు వివేకానందరెడ్డి మొత్తం బాద్యత అంతా తన భుజాన వేసుకుని చేసేవారు. అలాగే సోదరులు, కుటుంబంలోని ఇతర ప్రముఖులు, మనోహర్ రెడ్డి, భాస్కరరెడ్డి, వియ్యంకుడు గంగిరెడ్డి వంటి వారంతా అన్ని చూసుకునేవారు. అందువల్ల విజయమ్మ పెద్దగా తిరిగేవారు కారనే చెప్పాలి.కాని ఇప్పుడు పరిస్థితి మారింది.ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత సానుభూతి ఉన్నా, కుటుంబంలోనే చీలిక రావడం, వివేకానందరెడ్డి తనదారి తాను చూసుకోవడం, స్వయంగా కుమారుడు కడప లోక్ సభ ఎన్నికలలో అభ్యర్దిగా ఉండి ఏడు నియోజకవర్గాలలో తిరగవలసి రావడం వంటి కారణాల వల్ల విజయమ్మ ఎన్నికల ప్రచారంలోగట్టిగా తిరగవలసి వస్తున్నది.పైగా ఇది తనకన్నా కూడా తన కుమారుడికి అగ్ని పరీక్ష వంటిది.ఈ పరీక్షలో నెగ్గితేనే ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది.

వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని విజయమ్మ పులివెందుల గ్రామాలలో తిరుగుతున్నారు.మంత్రి టిజి వెంకటేష్ వంటి వారు ఓట్ల కోసం తల్లి కొడుకులు వీధినపడ్డారని అన్నా,తులసిరెడ్డి వంటివారు శాసనసభలో నోరు విప్పని వారు ప్రజలకు ఏమి చేస్తారని ప్రశ్నించినా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా అవేమీ పట్టనట్లే ఆమె ప్రచారం సాగిస్తున్నారు. అయితే మహిళలలో మాత్రం రాజశేఖరరెడ్డి భార్య స్వయంగా తమ ఇళ్లకు రావడం , ఓట్లు అడుగుతుండడంతో వారిలో సానుభూతి పెల్లుబుకుతోందన్న భావన ఉంది. అయితే అది ఎంత మేర ఓట్ల వర్షం కురిపిస్తుంది?వివేకా తాను అందుబాటులో ఉంటానంటూ ప్రచారం చేస్తున్నందున ఎంతమేర ఓట్లకు గండి పెడతారు అన్నదానిపైనే ఆమె మెజార్టీ ఆధారపడి ఉంటుంది.

Related posts:

  1. Nagam says he will support Jagan if…
  2. L Rajagopal avatharaalu velladistha
  3. Rebels already in YSR Cong
  4. Jagan’s loyalist Gone, dumps Jagan?
  5. Jagan gives shock to Ambati and Gone
  6. Who are Jagan’s coverts in cabinet?
  7. Deeksha planned by Jagan
  8. Balanaagi Reddy drama
  9. Congress ku August bhayam
  10. Problems for CBN and Chiru?

Leave a Reply

Spam protection by WP Captcha-Free