ఇంకెక్కడి సమైక్యత!

News pulse, Politics | admin | June 28, 2011 at 4:35 am

తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న దశలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీజోన్ వివాదాన్ని తేల్చకుండానే ఎసై్స రాత పరీక్షలకు సిద్ధపడడాన్ని ఏమనాలె? తెలంగాణ ప్రజలంటే ఇంత తిరస్కారమా? తెలంగాణ ఊదితే భగ్గుమనే స్థితిలో రగులుతున్నది. రాష్ట్ర రాజధాని నడిబొడ్డులోనే – ఒకవైపు తెలంగాణ ఉద్యోగుల పట్ల వివక్షను అంతమొందించాలంటూ విద్యుత్ సిబ్బంది నిరసన కార్యక్షికమం చేపట్టారు. ఇంకో దగ్గర జలసౌధ కార్యాలయంలో తెలంగాణ ఇంజనీర్లు తమకు న్యాయం జరగాలంటూ నిరసన ప్రదర్శనలు చేశారు.

దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ తెలంగాణ వారు కమిటీలు వేసుకుని తమ హక్కుల రక్షణకు ఏదో రూపంలో పొరాడుతూనే ఉన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఫ్రీ జోన్ వ్యతిరే క ఉద్యమం గతంలో ఎంత ఆందోళనకు దారి తీసిందో తెలిసి కూడా పుండు మీద కారం చల్లినట్టు మళ్ళీ ఆరవ జోన్‌లో హైదరాబాద్‌ను కలుపకుండానే ఎసై్స రాత పరీక్షలు జరపాలని నిర్ణయించింది.
హైదరాబాద్‌ను ఫ్రీ జోన్‌గా పరిగణించడానికి వ్యతిరేకంగా మహోద్యమం పెల్లుబికి రెండేళ్ళు కావస్తున్నది.

ఈ లోగా రాష్ట్రపతి ఉత్తర్వులలోని 14 ఎఫ్ నిబంధనను తొలగింప జేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో కృషి సాగించలేదు? అసెంబ్లీలో తీర్మానాలు చేసి నమ్మిం చి తీరా అమలులో మాత్రం తెలంగాణకు మొండిచేయి చూపడం అంటే ఇదే. రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ వారు ఆందోళన చేస్తారని తెలియక కాదు. మీరు ఎంత నెత్తి నోరు కొట్టుకున్నా ఒరిగేదేమీ ఉండదు, మా ఇష్టం వచ్చినట్టు మేం భర్తీ చేసుకుంటామనే సందేశాన్ని రాష్ట్ర ప్రభు త్వం ఇవ్వదలుచుకున్నది.

ఫ్రీ జోన్ చేయడమంటే ఆంధ్ర వారితో భర్తీ చేయడమేననేది స్పష్టం. రాష్ట్ర స్థాయి కార్యాలయాలలో, కొన్ని రకాల ఉద్యోగాలలో మాత్రమే జోనల్ విధానం వర్తించదని, వాటిలో కూడా సమన్యాయం పాటించాలని రాష్ట్రపతి ఉత్తర్వులలో ఉన్నప్పటికీ జరిగిందేమిటో తెలిసిందే. రాష్ట్ర స్థాయి కార్యాలయాల, ఉద్యోగాల సంఖ్య పెంచుతూపోయారు. తెలంగాణ వారికి ఆయా కార్యాలయాలలో న్యాయమైన వాటా లేకుండా ఆంధ్ర వారినే నింపుకున్నారు. జోనల్ విధానాన్ని సక్రమంగా అమలు చేయకుండా అనేక మంది ఆంధ్ర వారిని తెలంగాణలో నింపారు. ఆంధ్ర ప్రాంతంలోని తెలంగాణ వారిని వెనక్కు పంపడానికి జారీ చేసిన జీవోలు అమలు చేశారు.

తెలంగాణలోని ఆంధ్రవారిని వెనక్కు పంపమంటే మాత్రం జీవోలు జారీ చేసి అమలు చేయలేదు. ఉద్యమం వచ్చినప్పుడల్లా కమిటీలు వేసి కాలం గడుపుతారు. 610 జీవో, గిర్‌గ్లా నీ నివేదిక అమలు చేయాలని తెలంగాణవారు కోరుతూనే ఉన్నారు. ఆందోళన చెలరేగితే ఓ కమిటీ వేసి చేతులు దులుపుకుంటారు. జీవో అమలుకు మరో జీవో. ఆ జీవో అమలుకు ఇంకో జీవో. మంత్రుల కమిటీ, శాసన సభా కమిటీ, అధికారుల కమిటీ మొదలైనవన్నీ నియమించి చివరకు ఉత్త చేతులు చూపిన ఘన చరిత్ర ఆంధ్ర సర్కారుది. కుప్పల కొద్దీ ఉన్న ఈ జీవోల, కమిటీల కాగితాలతో సచివాలయం, అసెంబ్లీ నిండా తోరణాలు కట్టవచ్చు. అరబ్బు ఒంటె కథ మాదిరిగా కొంచెం తల దాచుకోవడానికి స్థలం అడిగి మొత్తం ఆక్రమించుకోవడం సమైక్య పాలనలో ప్రభుత్వ మద్దతుతో సాగుతూనే ఉన్నది. ముల్కీ నిబంధనలు, పెద్దమనుషుల ఒప్పందాలు, ప్రాంతీయ మండలి వంటివన్నీ గోదాట్లో కలిసిపోయినయి.

రాష్ట్రపతి ఉత్తర్వులో ఫ్రీ జోన్ అనేది లేకున్నా హైదరాబాదు కార్యాలయాల్లో ఆంధ్ర వారిని భర్తీ చేసిన చేదు అనుభవా లు తెలంగాణ వారికి ఉన్నాయి. విద్యా సంస్థల్లో, విశ్వ విద్యాలయాలలో సాధారణ సీట్లను ఆంధ్ర కోటాగా అమలు చేసిన ఘనత మన రాష్ట్ర పాలకులది. అందువల్లనే ఫ్రీ జోన్‌పై సుప్రీం కోర్టు తీర్పు రాగానే తెలంగాణ అంతా ఉలిక్కి పడింది. అప్రమత్తమైంది. ఉద్యమించింది.

హైదరాబాద్ ఫ్రీ జోన్ అయితే అక్కడితో ఆగదనేది కూడా తెలంగాణ వారికి తెలుసు. ఇటేటు రమ్మంటే ఇల్లంత నాదే అన్నట్టు ఫ్రీ జోన్‌ను పోలీసు శాఖకే పరిమితం చేయకుండా అన్ని శాఖలకు వర్తింప చేయాలని ఆంధ్ర నాయకులు ప్రకటనలు మొదలు పెట్టారు. హైదరాబాద్‌లోని అన్ని శాఖలను ఆంధ్రవారు ఆక్రమించుకున్న తరువాత ఇంతకాలం తమ జిల్లాల్లో ని బడుగు జీవులకు దక్కుతున్న సబార్డినేట్ సర్వీసులు కూడా మనకు కాకుండా పోతాయనేది తెలంగాణ వారు గ్రహించారు.

పదేళ్ళకు పైగా తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నా కనీసం సచివాలయంలోనైనా సమన్యాయాన్ని ఆంధ్ర పాలకులు పాటించలేదు. తెలంగాణ వారి కన్నీళ్ళు తుడువడానికి ఏ ఒక్క చర్య తీసుకోలేదు. సమైక్యంగా ఉండాలె, దోపిడి ఇదే రీతిలో సాగాలె అనేది వారి విధానం. ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూలో-రాత పరీక్షలో అత్యధిక మార్కులు తెచ్చుకున్న తెలంగాణ వారికి పది శాతం లోపు మార్కులు వేసి, అతి తక్కువ మార్కులు తెచ్చుకున్న ఆంధ్ర వారికి ఎనభై శాతానికి పైగా మార్కులు వేసిన చరిత్ర ఆంధ్ర పాలక వర్గానిది. తెలంగాణ వారు తమ వాటా ఎంతో తేల్చుమని అడిగినందుకు లాఠీ దెబ్బలు తినవలసి వచ్చింది.

తెలంగాణ ప్రజలు అనుక్షణం నీళ్ళ కోసం, నిధుల కోసం, కొలువుల కోసం, హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పోరాడుతూనే ఉంటే తప్ప ఎంతో కొంత న్యాయం జరగదని, ఆంధ్ర సర్కారు అనుక్షణం తెలంగాణ పట్ల వివక్షతోనే వ్యవహరిస్తూ ఉంటదని తాజా పరిణామాలు ధృవపరుస్తున్నాయి. అనుక్షణం చేయి చాపి అడుక్కునే బదులు, లాఠీ దెబ్బలు తినే బదులు అవమానాలు పడుతూ కన్నీళ్ళు పెట్టుకునే బదులు తెలంగాణ సాధించుకుని ఆత్మగౌరవంతో బతకడమే మంచిదని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. అందుకే ఫ్రీ జోన్ వ్యతిరేక ఉద్యమం తెలంగాణ విముక్తి ఉద్యమంగా మారిపోయింది.

Source – Namasthey Telangana

Related posts:

  1. I dare Nagendar, Mukesh to come out of Hyd
  2. ఫ్రీజోన్ కుట్ర కొనసాగింపు
  3. Sonia sets deadline for CM, Kiran?
  4. What did the Governor tell the center?
  5. SI exams issue again
  6. Kodandaram’s Delhi trips
  7. CM bows down to pressure from ministers
  8. What did KCR do for Telangana – Erraballi
  9. Telangana increment – KCR
  10. తెలంగాణ అమరవీరులకు జోహార్లు: జై తెలంగాణ

Leave a Reply

Spam protection by WP Captcha-Free